Thursday, 28 March 2019

ఫోన్లో యాంటీవైరస్ ఎంత ఘోరంగా పని చేస్తుందో చూడండి!


చాలామంది కంప్యూటర్లో మాదిరిగా ఫోన్లో కూడా వైరస్‌ల నుండి  రక్షణ పొందడం కోసం యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు వాడుతూ ఉంటారు. అయితే తాజాగా వెల్లడైన ఒక అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.
ఆస్ట్రేలియాకు చెందిన AV-కంపేరిటివ్స్  అనే సంస్థ Android ఆపరేటింగ్ సిస్టమ్ కోసం లభించే  మొత్తం 250 యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఫోన్లో ఇన్స్టాల్ చేసి పరిశీలించింది. వివిధ  యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లను ఒకసారి ఒకటి చొప్పున ఇన్స్టాల్ చేసి పరీక్షించింది. బాగా పాపులర్ అయిన 2000 మాల్వేర్లని అదే ఫోన్లో ఇన్స్టాల్ చేస్తే వీటిలో ఏ ఒక్క ప్రోగ్రాం పూర్తిస్థాయిలో వాటిని అడ్డుకోలేకపోయింది.
కొన్ని ప్రోగ్రాములు కేవలం 30 శాతం వరకు వైరస్‌లను మాత్రమే  అడ్డుకోగలుగుతున్నాయి. అధికశాతం యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు వైరస్‌లను  నిలుపుదల చేయడం కోసం బ్లాక్ లిస్ట్ పద్ధతిని అనుసరిస్తున్నాయి. దీనిని మాల్వేర్ తయారు చేసిన వ్యక్తులు  సులభంగా బైపాస్ చేయగలుగుతారు. అంతేకాదు, అనేక యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్స్‌ని  డౌన్లోడ్ చేసుకునే సమయంలో, కనీసం వాటిని స్కాన్ చేయలేకపోతున్నాయి.
ఈ సంస్థ ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం గమనించింది. Google Play Storeలో  సంబంధిత యాంటీవైరస్ ప్రోగ్రామ్‌ల గురించి వినియోగదారుల దృష్టిని ఆకట్టుకోవడం కోసం నకిలీ రివ్యూలు,  రేటింగ్ లు కూడా ఉన్నట్లు ఈ సంస్థ గమనించింది. కాబట్టి మన ఫోన్లో యాంటీవైరస్ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటే,  సురక్షితంగా ఉంటాం అన్న భావనలో ఉండాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం లభిస్తున్న ఏ యాంటీవైరస్ ప్రోగ్రామ్ కూడా  సమర్థవంతంగా మనల్ని రక్షించలేకపోతోంది.

No comments:

Post a comment